హాస్య చిత్రాల పితామహుడు జంధ్యాల జీవితం అలా ముగిసింది!
on Jan 14, 2025
(జనవరి 14 దర్శకుడు జంధ్యాల జయంతి సందర్భంగా..)
‘నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’.. జంధ్యాల పేరు ప్రస్తావనకి వస్తే మనకు గుర్తొచ్చే మాటలు ఇవే. టాప్ హీరోలతో, భారీ కథలతోనే కాదు, హాస్యంతో కూడా ఘనవిజయాలు అందుకోవచ్చు అని నిరూపించిన దర్శకుడు జంధ్యాల. పూర్తి స్థాయి హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే కాదు, టాలీవుడ్‌కి బ్రహ్మానందం, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు వంటి హాస్యనటుల్ని పరిచయం చేశారు. అద్భుతమైన హాస్య చిత్రాలను రూపొందించి హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్న జంధ్యాల బాల్యం ఎలా గడిచింది, సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం.
1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నారాయణమూర్తి, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు జంధ్యాల. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీరవెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి. పుట్టింది నరసాపురంలో అయినా పెరిగింది, చదువుకుంది మాత్రం విజయవాడలోనే. పదో ఏటనే కథలు రాయడం మొదలు పెట్టారు జంధ్యాల. అది చూసి స్కూల్ టీచర్స్ ఎంతో ఆశ్చర్యపోయేవారు. వారి సహకారంతో కొన్ని కథలను సంపుటిగా ప్రచురించారు కూడా. ఆయన కథల్లో హాస్యం ప్రధానంగా ఉండేది. పియుసి చదువుతున్న రోజుల్లో జంధ్యాల రాసిన 30 కథలు రేడియోలో వచ్చాయి. డిగ్రీ చదివే సమయంలో నాటకాలు రాసేవారు. రాయడమే కాదు, అందులో వేషాలు కూడా వేసేవారు. ఆయన 75 నాటకాలు, 20 నాటికలు రచించారు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. 1976లో హనుమాన్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన బొమ్మలు చిత్రంలో తొలిసారి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రానికి డైలాగ్స్ రాశారు. దాంతో రచయితగా జంధ్యాలకు మంచి పేరు వచ్చింది.
1977లో ఎన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అడవి రాముడు జంధ్యాలకు పెద్ద బ్రేక్ అని చెప్పాలి. అప్పటివరకు సినిమాల్లో వినిపిస్తున్న మాటలకు భిన్నంగా ఆయన రాసిన మాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అడవిరాముడు తర్వాత డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి సినిమాలకు కూడా జంధ్యాలనే తీసుకున్నారు రాఘవేంద్రరావు. ఈ సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. మాస్, యాక్షన్ సినిమాలకే కాదు, సంగీత ప్రధాన చిత్రాలకు కూడా ఎంతో డీసెంట్ డైలాగులు రాసేవారు. శంకరాభరణం, సాగరసంగమం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1976 నుంచి 1981 వరకు దాదాపు 100 సినిమాలకు రచన చేశారు జంధ్యాల. అందులో 90 శాతం సినిమాలు విజయం సాధించాయంటే అందులో ఆయన భాగస్వామ్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు 200 సినిమాలకు మాటలు రాసిన జంధ్యాలకు నాటకాలు డైరెక్ట్ చేసిన అనుభవం కూడా ఉండడంతో స్నేహితుల ప్రోత్సాహంతో దర్శకుడుగా మారాలనుకున్నారు. తొలి సినిమాగా ముద్దమందారం చిత్రాన్ని రూపొందించారు. అప్పటివరకు రాని ఒక విభిన్నమైన కథ, కథనం, మాటలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత జంధ్యాల చేసిన నాలుగు స్తంభాలాట చిత్రం అప్పట్లో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. సెంటిమెంట్‌తో కూడిన కథతో రూపొందిన ఈ సినిమాలో కామెడీ కూడా సమపాళ్ళలో ఉండడంతో ఇది శతదినోత్సవ చిత్రంగా నిలిచింది.
అప్పటి వరకు సినిమాల్లో కామెడీ అనేది ఒక భాగంగా, సెపరేట్ ట్రాక్‌గా ఉంటూ వచ్చింది. జంధ్యాల రాకతో పూర్తి కామెడీ సినిమాలు మొదలయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు రెళ్లు ఆరు, శ్రీవారి శోభనం, రెండు జెళ్ళ సీత, పుత్తడిబొమ్మ, జయమ్ము నిశ్చయమ్మురా, శ్రీవారికి ప్రేమలేఖ, అహనా పెళ్ళంట, బాబాయ్ అబ్బాయ్, చంటబ్బాయ్, పడమటి సంధ్యారాగం, చూపులు కలిసిన శుభవేళ, సీతారామకళ్యాణం వంటి సినిమాలు ఘనవిజయం సాధించడమే కాకుండా టాలీవుడ్‌లో హాస్యచిత్రాల ఒరవడిని బాగా పెంచాయి. ముఖ్యంగా జంధ్యాల సినిమాల్లోని క్యారెక్టర్స్ చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా ఒక డిఫరెంట్ మేనరిజమ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవి. ఒక సినిమాలోని క్యారెక్టర్ మరో సినిమాలో కనిపించేది కాదు. తన ప్రతి సినిమాలో క్యారెక్టర్లకు అంతటి వ్యత్యాసం చూపించేవారు. జంధ్యాల తర్వాత రేలంగి నరసింహారావు, ఇ.వి.వి.సత్యనారాయణ, వంశీ వంటి దర్శకులు పూర్తి హాస్య భరిత చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నారు. కామెడీ చిత్రాలను రూపొందించాలని ఇండస్ట్రీకి వచ్చే దర్శకులంతా జంధ్యాలను తమ గురువుగా భావిస్తారు. ఆయన చేసిన తరహా సినిమాలు యువ దర్శకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కొందరికి మాస్ సినిమాలంటే ఇష్టం. మరికొందరు యాక్షన్, సెంటిమెంట్ సినిమాలను ఇష్టపడతారు. కానీ, అందరూ ఇష్టపడేది మాత్రం హాస్య చిత్రాలనే. మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు తను స్ట్రెస్ ఫీల్ అయినపుడు జంధ్యాల సినిమాలు, రాజేంద్రప్రసాద్ సినిమాలు చూస్తానని చెప్పేవారు. అంతేకాదు, ఇప్పుడు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఎంతో మంది ఇళ్ళల్లో జంధ్యాల సినిమాల కలెక్షన్ ఉంటుందంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. ఆయన దర్శకుడుగానే కాదు నటుడుగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాటకాలు వేసే రోజుల్లో ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎంతో మంది ప్రముఖ నటులకు తన గాత్రాన్ని అందించారు.
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డు కూడా లభించింది. పడమటి సంధ్యారాగం చిత్రానికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డు, ఆపద్బాంధవుడు చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు. తను రూపొందించిన హాస్య చిత్రాల ద్వారా ఎంతోమందికి గుండెజబ్బును దూరం చేశారని అంటారు. కానీ, చివరికి 50 సంవత్సరాల వయసులో 2001 జూన్ 19న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు జంధ్యాల హాస్య చిత్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గదు అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం.
Also Read